testimony picture

చెర నుండి స్వేచ్ఛకు.....

- Naveen

ప్రభువు నందు ప్రియమైన వారలారా, మీ అందరికి యేసు క్రీస్తు నామములో వందనములు.నా పేరు నవీన్, దేవుని యందు విశ్వాసముతో కొనసాగుతున్న సాక్షిని. నా జీవితంలో ఇంత గొప్ప రక్షణ ఎలా పొందానో, దేవుడు నన్ను ఎలా మార్చుకున్నాడో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను.

దేవుడు నన్ను దర్శించుటకు ముందు నేను హైందవుడను. మా నాన్నగారు వ్యాపారం చేసేవారు, మా అమ్మగారు టీచర్ (H.M) గా పని చేసేవారు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు.మొట్టమొదటిగా మా ఇంట్లో బైబిల్ మా అమ్మమ్మగారు ద్వారా పరిచయం అయ్యింది. మా అమ్మగారికి పెళ్ళి అయిన ఆరు సంవత్సరాలు వరకు పిల్లలు లేరు. మా అమ్మగారు దేవుని సన్నిధిలో పిల్లల కోసం ప్రార్ధించేవారు. ప్రార్ధన ద్వారా మేము పుట్టాము. చిన్నప్పటి నుంచి నన్ను చాలా గారాబంగా పెంచారు. యవ్వన కాలం వచ్చేసరికి చెడు స్నేహాలు నా జీవితం పై చాలా ప్రభావం చూపాయి. దాని వలన విపరీతమైన త్రాగుడు, డ్రగ్స్ కి అలవాటు పడ్డాను.అది తప్పు అని మనస్సుకి అనిపించినా బయటకు రాలేనంతగా బానిసను అయ్యాను. ఆ చెడు అలవాటులు మానడం కోసం మానసిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా, హిందూ మత ఆచారం ప్రకారం అనేక మాలలు వేసుకున్నా నా జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు.అప్పుడు మాకు ఒక మేడమ్ గారి ద్వారా పాష్టర్ ప్రసాద్ గారు పరిచయం అయ్యారు. చర్చికి మా అమ్మ గారిని తీసుకుని వెళ్ళినప్పుడు అప్పుడప్పుడూ పాష్టరుగారు నాతో మాట్లాడేవారు. ఆయన దేవుని గురించి చెబుతూ దేవుని వైపు మనం ఒక్క అడుగు వేస్తే దేవుడు మన వైపు పది అడుగులు వేస్తాడు అని చెప్పారు. ఆ మాటలు నేను ఆ రోజు అంతగా పట్టించుకోలేదు..

కొన్ని రోజులు గడచిన తర్వాత ఒక్క గొడవలో నేను ఇరుక్కున్నాను. నాపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. నేను పోలీసులకు దొరకుండా తప్పించుకుని తిరుగుతున్న ఆ సమయంలో పాష్టరుగారు దేవుని వైపు మనం ఒక్క అడుగు వేస్తే దేవుడు మన వైపు పది అడుగులు వేస్తాడు అని చెప్పిన మాటలు నాకు గుర్తొచాయి. అప్పుడు నేను ఉన్న చోటే ఈ కేసు నుండి నన్ను తప్పిస్తే త్రాగుడు, డ్రగ్స్, గొడవలు మానేస్తాను అని దేవునికి ప్రార్ధన చేసాను. అద్భుతంగా దేవుడు ఆ కేసు నుండి నన్ను తప్పించడం వల్ల నాకు తప్ప అందరికి శిక్షపడింది.

ఆ రోజు నుంచి చర్చికి వెళ్ళి వాక్యం వినడం ద్వారా దేవుని గురించి ఆయన ప్రేమను గురించి తెలుసుకున్నాను. అప్పుడు ఒక రాత్రి దేవుడు నన్ను దర్శించారు. ఆ రోజు నుండి నా జీవితం పూర్తిగా మారిపోయింది. దేవుని ప్రేమలో ఉన్న శక్తి, ఆయన సిలువలో చేసిన త్యాగము నన్ను పూర్తిగా ఆయన వైపు తిప్పుకున్నాయి. ఎక్కువ సమయం దేవునితో గడపాలని ఆశపడేవాడిని. కాని నా చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులు వీడు కూడా దేవుని పేరు చెప్పి డబ్బులు దోచుకోవడానికి సిద్ధపడ్డాడు అని అనేవారు. ఆ మాటలు నన్ను చాలా బాధపెట్టేవి, నా వలన దేవుని నామముకు అవమానం కలుగుతుంది అని అనిపించేది. ఉద్యోగము చేయాలి అని అనుకున్నాను. కాని నేను 10వ తరగతి వరకే చదివాను కాబట్టి నాకు ఉద్యోగము ఎవరు ఇస్తారు అని ఆలోచించేవాడిని. అప్పుడు పేపర్లో P.R.O లు కావలెను అని ప్రకటన చూసి ఒక్క చిన్న స్కూలు లో P.R.O గా join అయ్యాను. ఆ ఉద్యోగము దేవుడు ఇచ్చిందని నమ్మి నమ్మకంగా పని చేసాను. దేవుడు ఆశీర్వదించారు. ఆ తరువాత పేరుగాంచిన స్కూలు లో P.R.O గా సెలక్ట అయ్యాను. కొద్ది రోజులలోనే దేవుని కృప వలన A.O గా ప్రమోషన్ పొందాను. నిజానికి I.I.T స్కూల్ కి 10వ తరగతి చదివిన వ్యక్తి A.O గా చేయుట అది ప్రధమం. ఇది దేవుని అద్భత క్రియ. ప్రస్తుతం దేవుడు నన్ను సొంత వ్యాపారం తో ఆశీర్వదించారు. దేవుని సాక్షిగా, సేవలో సహకరిస్తూ ముందుకు సాగుతున్నాను.